నేడే నూతన ఎ.పి. ఎఫ్‌డీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం

1001317737

ఎ.పి. ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ (ఎఫ్‌డీసీ)కి సీఎం చంద్రబాబు నాయుడు కొత్త ఊపు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రముఖ పంపిణీదారుడు భరత్ భూషణ్‌ను ఛైర్మన్‌గా నియమించిన ప్రభుత్వం, ఆయనతో పాటు సినిమా రంగానికి చెందిన పలువురిని డైరెక్టర్లుగా ఎంపిక చేసింది. ఇప్పటివరకు ఎఫ్‌డీసీలో రాజకీయ నేపథ్య వ్యక్తులకే ఎక్కువ ప్రాధాన్యం ఉండగా, ఈసారి మాత్రం నటులు, దర్శకులు, రచయితలు, నిర్మాతలు, సినిమాటోగ్రాఫర్లు, నాటకరంగ ప్రతినిధులు, ఎగ్జిబిటర్లకు చోటు కల్పించడం ప్రత్యేకతగా నిలిచింది.

దర్శకుడు మెహర్ రమేశ్‌, నటులు సుమన్‌, శివాజీ, ఝాన్సీ, రచయిత సాయిమాధవ్ బుర్రా, దర్శకుడు సముద్ర, సీనియర్ పాత్రికేయుడు ఉమా మహేశ్వరరావు తదితరులు డైరెక్టర్లుగా నియమితులయ్యారు. తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత ఎఫ్‌డీసీ ప్రభావం తగ్గిపోయిన నేపథ్యంలో, ఇప్పుడు మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వస్తోందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

ఎఫ్‌డీసీ ఛైర్మన్‌, డైరెక్టర్లు విజయవాడలోని కార్యాలయంలో ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సూచనలతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి ఎఫ్‌డీసీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.