ఈ తరం ప్రేక్షకులకు ఈ సినిమా కొత్త అనుభూతిని కలిగిస్తుందని చిత్ర బృందం ముందునుంచి చెబుతున్నట్టుగానే “రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి” ట్రైలర్ ఎంతో వైవిధ్యంగా ఉంది. లవ్, కామెడీ, సస్పెన్స్ వంటి అంశాలతో రూపొందిన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. పల్లెటూరు నేపథ్యంలో సాగే హాస్య సన్నివేశాలతో వినోదభరితంగా ట్రైలర్ ప్రారంభమైంది. నాయికా నాయకుల మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు మెప్పించాయి. సాఫీగా సాగిపోతున్న ట్రైలర్ కథానాయిక హత్యతో ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగింది. ఆమెను కథానాయకుడే చంపాడని, పోలీసులు అతని కోసం వెతుకుతుంటారు. అసలు రాజు గారి అమ్మాయి ఎలా చనిపోయింది? నాయుడు గారి అబ్బాయే ఆమెను హత్య చేశాడా? హత్యకు కారణమేంటి? అనే ప్రశ్నలను రేకెత్తిస్తూ ట్రైలర్ ను ముగించిన తీరు కట్టిపడేసింది.
ఈ సందర్భంగా దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్ గారు మాడ్లాడుతూ.. “రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి అనేది అందరికీ బాగా కనెక్ట్ అయ్యే టైటిల్. విలేజ్ బ్యాక్ డ్రాప్ కథతో దర్శకుడిగా సత్యరాజ్ మొదటి సినిమా చేశాడు. సినిమాలో కమర్షియల్ అంశాలు దండిగా ఉన్నాయి. సత్యరాజ్ కి ఆల్ ది బెస్ట్. అలాగే ముత్యాల రామదాసు గారు ఛాంబర్ లోనూ, కౌన్సిల్ లోనూ అనేక పదవుల్లో సేవలు అందించారు. చిన్న సినిమాలకు, నిర్మాతలకు ఎప్పుడూ అండగా ఉంటుంటారు. ముత్యాల రామదాసు నేతృత్వంలో రూపొందిన ప్రేక్షకులను అలరిస్తుందని భావిస్తున్నాను. సాలూరి రాజేశ్వరరావు గారి మనవడు రోషన్ సాలూరి మంచి సంగీతం అందించాడు. అందుకే ఆదిత్య సంస్థ పాటలను విడుదల చేయడానికి ముందుకు వచ్చింది. హీరో రవితేజ నున్నా ట్రైలర్ లో బాగా చేశాడు. పక్కింటి అబ్బాయిలా కనిపిస్తున్నాడు. హీరోయిన్ నేహ కూడా ఎటువంటి బెరుకు లేకుండా చాలా బాగా చేసింది. ఈ చిత్రం ఘన విజయం సాధించి.. నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను” అన్నారు.
నిర్మాత ముత్యాల రామదాసు గారు మాట్లాడుతూ.. “రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి అనే టైటిల్ తోనే సినిమా పట్ల ఆసక్తి కలిగేలా చేశారు. దర్శకుడు సత్యరాజ్ కి మంచి విజన్ ఉంది. సంగీత దర్శకుడిగా రోషన్ సాలూరిని తీసుకొని తనకున్న పరిమిత వనరులతోనే అద్భుతమైన సంగీతాన్ని రాబట్టుకోగలిగాడు. పాటలన్నీ చాలా బాగున్నాయి. దర్శకుడు తాను ఏం చేయాలో ఈ సినిమా కోసం అంతా చేశాడు. ఒక ప్రొడ్యూసర్ గా కాకుండా ఒక డిస్ట్రిబ్యూటర్ గా మేము ఆలోచించేది ఏంటంటే ఇది కమర్షియలా కాదా. ఎందుకంటే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే అంశాలు సినిమాలో ఉండాలి. మంచి మ్యూజిక్, ఫైట్స్ వంటి కమర్షియల్ అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఈమధ్య కాలంలో చిన్న సినిమాలు కూడా పెద్ద విజయం సాధించడం చూస్తున్నాం. రాజుగారి అమ్మాయి నాయుడుగారి చిత్రంలో కూడా ఆ కళ కనిపిస్తుంది. ఫైనాన్షియల్ సమస్యలు ఎదుర్కొని దర్శకుడు ఈ సినిమాని పూర్తి చేయడం గొప్ప విషయం. అతను భవిష్యత్ లో పెద్ద దర్శకుడు కావాలని కోరుకుంటున్నాను. ఇక చిత్ర హీరో రవితేజకి బయట కాస్త సిగ్గు ఎక్కువ. కానీ స్క్రీన్ మీద చూసేటప్పుడు రజినీకాంత్ లా కనిపిస్తాడు. ఎంతో ప్రతిభ ఉన్న రవితేజ పెద్ద హీరో కావాలని కోరుకుంటున్నాను. ఎన్ని సమస్యలు ఎదురైనా ఎక్కడా రాజీపడకుండా తీసిన సినిమా ఇది. ఈ చిత్ర నిర్మాణంలో భాగమైన రవితేజ తల్లి గారు కుమారి, రామిశెట్టి వెంకట సుబ్బారావు గారు, కలవకొలను సతీష్ గారు అందరికీ ఆల్ ది బెస్ట్. మార్చి 9న విడుదలవుతున్న ఈ సినిమాకి మీడియా సహకారం ఉంటుందని, ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరిస్తారని భావిస్తున్నాను.” అన్నారు.
దర్శకుడు సత్యరాజ్ మాట్లాడుతూ.. “ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి ప్రధాన కారణం ముత్యాల రామదాసు గారు. మా సినిమాని ఆయనే ముందుండి నడిపిస్తున్నారు. చిన్న సినిమాని బతికించాలంటే అది మీడియా వల్లే సాధ్యమవుతుంది. అందుకే మీడియానే ముఖ్యఅతిథులుగా భావించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మా సినిమా పూర్తయ్యి, విడుదలకు సిద్ధమైందంటే రామదాసు గారే కారణం. ఆయన ఇచ్చిన ధైర్యంతోనే మేము ముందుకు వెళ్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన వీరశంకర్ గారికి ప్రత్యేక కృతఙ్ఞతలు. హీరో రవితేజ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. సినిమా మొదలైనప్పటి నుంచి పూర్తయ్యేవరకు అన్నింట్లో ఇన్వాల్వ్ అవుతూ నాకు ఎంతో సపోర్ట్ గా నిలిచాడు. సంగీత దర్శకుడు రోషన్, డీఓపీ మురళి కూడా ఎంతో సహకరించారు. ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ కృతఙ్ఞతలు” అన్నారు.
కథానాయకుడు రవితేజ నున్నా మాట్లాడుతూ.. “నిర్మాత ముత్యాల రామదాసు గారు మా వెనకుండి ఈ సినిమాని విజయవంతంగా పూర్తి చేయించి, ఇక్కడివరకు తీసుకొచ్చారు. రామదాసు గారికి మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు. మా దర్శకుడు, నేను ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డామో అది మాకు మాత్రమే తెలుసు. ఎంతో ఇష్టంతో ఈ సినిమా కోసం కష్టపడ్డాం. విలేజ్ బ్యాక్ డ్రాప్ ఉండే కమర్షియల్ సబ్జెక్టు ఇది. మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. హీరోయిన్ నేహ జురెల్ చాలా బాగా చేసింది. జబర్దస్త్ బాబీ, జబర్దస్త్ అశోక్ మాకు ఎంతగానో సహకరించారు. అలాగే మా అమ్మ నున్నా కుమారి గారు లేకపోతే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వదు. థాంక్యూ అమ్మ. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. ప్రేక్షకులను ఈ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను.” అన్నారు.
ఈ చిత్రానికి రోషన్ సాలూరి సంగీతం అందించగా.. మురళీ కృష్ణ వర్మ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. డాన్స్ మాస్టర్ గా రవి మేకల, ఎడిటర్ గా టి.కిషోర్ బాబు పనిచేశారు. ఎక్స్క్యూటివ్ ప్రొడ్యూసర్స్ గా రెంటికోట ధర్మ, రవి మేకల వ్యవహరించారు.
ట్రైలర్ విడుదల కార్యక్రమంలో చిత్ర విడుదల తేదీని కూడా ప్రకటించారు నిర్మాతలు. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను అలరించడానికి ఈ చిత్రం మార్చి 9వ తేదీన థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల కానుంది.
తారాగణం:
కథానాయకుడు: రవితేజ నున్నా
కథానాయిక: నేహా జురెల్
ఇతర ప్రధాన పాత్రలలో : నాగినీడు, ప్రమోదిని, జబర్దస్త్ బాబీ,జబర్దస్త్ అశోక్, పుష్ప దుర్గాజి, యోగి ఖత్రి , అజిజ్ భాయ్, వీరేంద్ర, గిద్ద మోహన్, అప్పిరెడ్డి, కంచిపల్లి అబ్బులు, శ్రావణి
సాంకేతిక బృందం:
సంగీతం: రోషన్ సాలూరి
ఛాయాగ్రహణం: మురళి కృష్ణ వర్మ
కూర్పు: కిషోర్ టి
దర్శకత్వం: సత్య రాజ్
సమర్పణ: మణికొండ రంజిత్
నిర్మాతలు: ముత్యాల రామదాసు, నున్నా కుమారి
సహ నిర్మాతలు: రామిశెట్టి వెంకట సుబ్బారావు, కలవకొలను సతీష్