ముఖ్యమంత్రిగా రెండుసార్లు అధికారం చూసిన తండ్రిని కడతేర్చి, తాను ముఖ్యమంత్రి కావాలని ఆశించిన కొడుకు కథ ఇందులో కనిపిస్తుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆ తనయుడి పాత్రను పలువురు పలువిధాలుగా భావించుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ్ముని కొడుకైన నారా రోహిత్ ఈ ‘ప్రతినిధి-2’లో కథానాయకుడు – అందువల్ల తెలుగు దేశం శ్రేణులు ఈ కథలోని పాత్రలను తమ ఊహలకు అనుగుణంగా భావించవచ్చు. ప్రస్తుతం ‘టీవీ ఫైవ్ మూర్తి’గా పేరొందిన మూర్తి దేవగుప్తపు ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అయ్యారు. ఇందులోని ప్రధానాంశం మీడియా చుట్టూనే పరిభ్రమిస్తూ ఉంటుంది. అలాగే కథానాయకుడు కూడా ఓ ఛానెల్ కు సీఈవోగా దర్శనమిస్తాడు. అందువల్ల ‘ప్రతినిధి-2’ ఎన్నికలకు ముందు విడుదల కావడం విశేషంగా మారింది.
కథ – ప్రజలు ఎంతగానో అభిమానించే ముఖ్యమంత్రి ప్రజాపతి తన క్యాంపు కార్యాలయంలో ఉండగా అది పేలిపోతుంది. ముఖ్యమంత్రి ఆ పేలుడులో మరణించారని తెలుస్తుంది. ఆ విషయాన్ని అన్ని ఛానల్స్ ప్రసారం చేస్తాయి. యన్.యన్.సి. అనే ఛానల్ కు సీఈవోగా ఉన్న చేతన్ అనే జర్నలిస్ట్ కు కూడా గాయాలు అవుతాయి. అయినా అక్కడ నుండే ఆ పేలుడుకు సంబంధించిన విషయాలను అందిస్తాడు చేతన్. ఏటికి ఎదురీదడమే తెలిసిన జర్నలిస్ట్ చేతన్ ను అందరూ ‘చే’ అంటూ పిలుస్తుంటారు. ఒకప్పుడు పేరుమోసిన జర్నలిస్ట్ గా ఉన్న ఉదయభాను రాజకీయనాయకుల కుట్రలకు బలియై ఉంటుంది. దాంతో విదేశాలకు వెళ్ళి బాగా సంపాదిస్తుంది. స్వదేశం వచ్చాక ఓ న్యూస్ ఛానల్ పెట్టాలనుకుంటుంది. దానికి చేతన్ ను సీఈవోగా ఎంచుకుంటుంది. అతను ఓకే అంటేనే ఛానల్ తీసుకు రావాలన్నది ఉదయభాను నిర్ణయం. జనానికి కీడు చేసేవారెవరైనా సరే ప్రజాతీర్పుకై బోనులో నిలుపుతానని అంటాడు చేతన్. అందులో మీరు తప్పు చేసినా వదలననీ ఉదయభానుకు చెబుతాడు. అందుకు ఆమె అంగీకరించడం వల్లే సీఈవోగా చేరతాడు. రాష్ట్ర రాజకీయాల్లో జరిగే అనేక అంశాలను అందరికన్నా ముందుగా ప్రసారం చేస్తూ యన్.యన్.సి. ఛానల్ పేరు సంపాదిస్తుంది. ఆ తరువాతే ఛీఫ్ మినిస్టర్ క్యాంప్ ఆఫీస్ బ్లాస్ట్ అవుతుంది.
ముఖ్యమంత్రి వారసుడు విశ్వను ఛీఫ్ మినిస్టర్ గా ప్రమాణస్వీకారం చేయిస్తూండగా, ముఖ్యమంత్రి ప్రజాపతి బతికే ఉన్నాడన్న విషయం తెలుస్తుంది. దాంతో జనం, పాలక పక్షం, ప్రతిపక్షం అయోమయంలో పడతారు. రాష్ట్రంలో అంతకు ముందే నెలకొన్న గవర్నర్ పాలన కొనసాగుతుంది. ముఖ్యమంత్రిని చంపాలనుకున్నది ఎవరో తెలుసుకొనేందుకు ప్రత్యేకంగా ఓ సీబీఐ ఆఫీసర్ రంగంలోకి దిగుతాడు. బ్లాస్ట్ జరిగిన రోజున ముఖ్యమంత్రి ఒక్కరే ఎందుకని క్యాంప్ ఆఫీసులో ఉన్నారు? ఆయన సెక్యూరిటీ ఆఫీసర్ కానీ, సీఎస్ సిరి కానీ ఎందువల్ల అక్కడ లేరు? అన్న అంశాలపై పరిశోధన ప్రారంభిస్తాడు ఆ సీబీఐ ఆఫీసర్. అతనికి కొన్ని లింకుల ద్వారా ఆ బాంబ్ బ్లాస్ కు జర్నలిస్ట్ చేతన్ కు సంబంధం ఉందని తెలుసుకుంటాడు. చేతన్ ను అరెస్ట్ చేసి స్పెషల్ ఆఫీసర్ ఇంటరాగేషన్ చేస్తాడు. ఆ సమయంలో చే, స్పెషల్ ఆపీసర్ ఇద్దరిపై హత్యాప్రయత్నం జరుగుతుంది. చివరకు ముఖ్యమంత్రి తనయుడే ఈ కుట్ర వెనుక ఉన్నాడని తెలుస్తుంది. అతణ్ణి అరెస్ట్ చేస్తారు. ముఖ్యమంత్రి తనను కాపాడింది చేతన్ అని అందరిముందు గర్వంగా చెబుతాడు. కానీ, చేతన్ మాత్రం ముఖ్యమంత్రికి మాత్రమే వినిపించేలా ‘మా అసలు టార్గెట్ మీరే సార్’అని చెబుతాడు. ఆ తరువాత ఏమవుతుంది అన్న అంశాన్ని ‘ప్రతినిధి-3’లో చూడమని దర్శకుడు చెప్పడంతో కథ ముగుస్తుంది. ఇంతకూ ముఖ్యమంత్రిని సొంత కొడుకే చంపడానికి దారి తీసిన కారణాలేంటి? అందులో అతనికి సహాయపడిన వారెవరు? ఓ ఉపఎన్నికలో అభ్యర్థుల కంటే ‘నోటా’కే ఎక్కువ ఓట్లు ఎలా వచ్చాయి? హీరో చేతన్ బాంబు పేలుడుకు సంబంధించిన వివరాలు ఎలా సేకరించాడు? అతను ముఖ్యమంత్రినే తమ టార్గెట్ అని ఎందుకు అన్నాడు? అన్న ఆసక్తికరమైన అంశాలకు ‘ప్రతినిధి-2’నే సమాధానం చెబుతుంది.
సరిగా పదేళ్ళ క్రితం ‘ప్రతినిధి’ అనే సినిమాతో జనం ముందు నిలచిన నారా రోహిత్ అప్పట్లో మంచి విజయాన్నే సొంతం చేసుకున్నారు. ఆ చిత్రానికి సీక్వెల్ గా ‘ప్రతినిధి-2’ తెరకెక్కింది. అందులో కన్నా ఇందులో రోహిత్ మరింత బొద్దుగా కనిపించారు. ఆయనపై చిత్రీకరించిన రెండు పాటలు కథకు అడ్డు పడేవే తప్ప, ఆదుకొనేవి కావు. పాటల్లోనూ నారా రోహిత్ తో స్టెప్స్ వేయించక పోయి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఇక ఛానల్ ఓనర్ గా ఉదయభాను చాలా రోజుల తరువాత నిడివి ఉన్న పాత్రలో కనిపించారు. ముఖ్యమంత్రిగా సచిన్ ఖేడేకర్, ఆయన తనయుడు విశ్వగా దినేశ్ తేజ్, సీబీఐ స్పెషల్ ఆఫీసర్ గా జిస్సు సేన్ గుప్త, ఛీఫ్ సెక్రటరీగా సిరి లేళ్ళ నటించారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ను పోలిన పాత్రలో అజయ్ కనిపించారు. పృథ్వీరాజ్, రఘుబాబు, సప్తగిరి కాసేపు నవ్వులు పంచే ప్రయత్నం చేశారు. ప్రతిపక్ష నాయకురాలుగా ఇంద్రజ కొద్దిసేపు తళుక్కుమన్నారు. సినిమాలో రెండు పాటలు ఉన్నా, అంతగా ఆకట్టుకోలేవు. పాటలను అలా వదిలేస్తే, కనీసం నేపథ్య సంగీతంలోనూ మహతి స్వరసాగర్ సత్తా చూపించలేకపోయారు.
ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వం మూర్తి దేవగుప్తపు సమకూర్చారు. పలు సన్నివేశాల్లో మాటలు ఆకట్టుకొనేలా రూపొందాయి. అయితే కథనం మాత్రం పాతదనాన్నే సంతరించుకుంది. సినిమా మొదట్లోనే ‘తప్పు ఎవరు చేసినా క్షమించనని, సొంత కొడుకు తప్పు చేసినా ఉపేక్షించనని’ ముఖ్యమంత్రి పాత్రతో చెప్పించారు. అక్కడే కుట్రదారు ఎవరో మనకు తెలిసిపోతుంది. ముఖ్యమంత్రి మరణించారని, ఆయనకు అంతిమసంస్కారాలు జరిపిస్తారు. ఆ అంతిమ యాత్ర సీన్స్ అచ్చు వై.యస్.రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు సాగిన తీరునే గుర్తు చేస్తాయి. అలాగే ముఖ్యమంత్రి జీవించే ఉన్నాడని చెప్పడం కూడా పెద్దగా థ్రిల్ కలిగించదు. హీరోకు ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అది ప్రథమార్ధంలోనే రివీల్ చేయడంతో ప్రేక్షకుడు తరువాతి సన్నివేశాలను ఇట్టే గుర్తు పట్టేస్తాడు. అయితే ఇది ఓ కొత్త దర్శకుని నుండి వచ్చిన సినిమా కాబట్టి, ఎక్కువగా శల్య పరీక్ష చేయడం సబబు కాదు. దర్శకునిపై నమ్మకంతో అతను చెప్పిన కథను తెరకెక్కించాలని కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, కొండకళ్ళ రాజేందర్ రెడ్డి ముందుకు రావడం అభినందనీయం.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జమిలి ఎన్నికలు జరుగుతున్నాయి. అందువల్ల దేశంలో అందరి దృష్టి ఏపీపైనే ఉంది. ఈ నేపథ్యంలోనే కొన్ని రాజకీయ చిత్రాలు జనం ముందుకు వచ్చాయి. అలాగే ఎన్నికలకు మూడు రోజుల ముందుగా మే 10వ తేదీన ‘ప్రతినిధి-2’ వెలుగు చూసింది. ఈ ఎన్నికల సమయంలో వచ్చిన రాజకీయ చిత్రాల్లో కొన్ని పాలకపక్షానికి, మరికొన్ని ప్రతిపక్షానికి కొమ్ము కాశాయి. అయినా, జనం వేటినీ పట్టించుకోలేదు. మరి ‘ప్రతినిధి-2’ను ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి.
ప్లస్ పాయింట్స్:
- ‘ప్రతినిధి’ సినిమాకు సీక్వెల్ కావడం
- చంద్రబాబు తమ్ముని కొడుకు నారా రోహిత్ హీరో కావడం
- తెలుగుదేశం శ్రేణులను ఆకట్టుకొనే కొన్ని అంశాలు చోటు చేసుకోవడం
- చంద్రబాబుకు మద్దతు పలికే టీవీ ఫైవ్ మూర్తి దర్శకుడవ్వడం
మైనస్ పాయింట్స్:
- కథ, కథనంలో కొత్తదనం లేకపోవడం
- అలరించలేక పోయిన సంగీతం, సాహిత్యం
- ఆకట్టుకోని సాంకేతిక వర్గం పనితీరు
రేటింగ్: 3/5