11 రోజులపాటు ప్రాయశ్చిత్త పవన్ కళ్యాణ్ దీక్ష

Screenshot 2024 09 22 075054

గత కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్ లో తిరుమల తిరుపతి దేవస్థాన ప్రసాదమైన లడ్డు వివాదం అందరికీ తెలిసిందే. గత నాలుగు సంవత్సరాలుగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాద లడ్డులో మాంసాహారాలకు సంబంధించిన కొన్ని పదార్థాలు, అలాగే చేప నూనె ఇంకా నాణ్యతలేని నెయ్యను ఉపయోగించినట్లు కొన్ని టెస్టుల ద్వారా నిరూపించబడింది. దీనిపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ప్రభుత్వం అలాగే కొంతమంది భక్తులు స్పందించారు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు జరిగిన దోషానికి తన వంతు ప్రాయశ్చిత్తంగా 11 రోజులపాటు దీక్ష చేయనున్నానని తన X ద్వారా తెలిపారు. దీనికి సంబంధించి ఆయన తన X ద్వారా ఇలా తెలపడం జరిగింది.

ఏడుకొండలవాడా..! క్షమించు •11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష అమృతతుల్యంగా… పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం- గత పాలకులు వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైంది. జంతు అవశేషాలతో మాలిన్యమైంది. విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగట్టగలరు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం హైందవ జాతికే కళంకం. లడ్డు ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం నా మనసు వికలమైంది. అపరాధ భావానికి గురైంది. ప్రజా క్షేమాన్ని కాంక్షించి పోరాటంలో ఉన్న నాకు ఇటువంటి క్లేశం ఆదిలోనే నా దృష్టికి రాకపోవడం బాధించింది. కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే. అందులో భాగంగా నేను ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని సంకల్పించాను. 22 సెప్టెంబర్ 2024 ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపడతాను. 11 రోజులపాటు దీక్ష కొనసాగించి అనంతరం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటాను. ‘దేవదేవా… నీ పట్ల గత పాలకులు చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తిని ఇవ్వమ’ని వేడుకుంటాను. భగవంతుడిపై విశ్వాసం, పాప భీతి లేనివారే ఇటువంటి అకృత్యాలకు ఒడిగడతారు. నా బాధేమిటంటే- తిరుమల తిరుపతి దేవస్థానం అనే వ్యవస్థలో భాగమైన బోర్డు సభ్యులు, ఉద్యోగులు సైతం అక్కడి తప్పిదాలను కనిపెట్టలేకపోవడం, కనిపెట్టినా నోరు మెదపకపోవడం. నాటి రాక్షస పాలకులకు భయపడి మిన్నకుండిపోయారా అనిపిస్తోంది. వైకుంఠ ధామంగా భావించే తిరుమల పవిత్రతకు, వేదాచారాలకు, ధార్మిక విధులకు కళంకం తెచ్చే విధంగా పెడపోకడలకు పాల్పడిన గత పాలకుల తీరు హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరినీ బాధించింది. ఇక లడ్డు ప్రసాదం తయారీలో జంతు అవశేషాలు ఉన్న నెయ్యిని వినియోగించారనే విషయం తీవ్ర క్షోభకు గురి చేసింది. ధర్మాన్ని పునరుద్ధరించుకొనే దిశగా అడుగులు వేసే తరుణం ఆసన్నమైంది. ధర్మో రక్షతి రక్షితః