సీనియర్ రచయిత తోటపల్లి మధు ఇలా మాట్లాడటం సమంజసమేనా

WhatsApp Image 2024 04 28 at 21.28.19 49b82546

ఎంత గొప్ప సినిమా అయినా కాగితంపైన రాసే అక్షరం తోనే ప్రారంభం అవుతుంది.అందుకే రచయితదెప్పటికీ అగ్రస్థానమే అని నమ్ముతాను. నావరకూనేను రచయిత స్థాయి వయసుతో నిమిత్తం లేకుండా ఎప్పుడూ గౌరవిస్తాను. అందరూ గౌరవించాలని కోరుకుంటాను.

ఇదిగో ఈ ఫోటోలో వున్న సీనియర్ రచయిత తోటపల్లి మధు గారి వంటివారు మాత్రం కొంత ప్రత్యేకం. వీరికి కొన్ని ప్రత్యేక ప్రతిభలున్నాయి. మీడియా మైక్ పెట్టి కెమెరా ఆన్ చేస్తేచాలు, పరిశ్రమలో ఎంత సాధించినవారినైనా వాడు వీడు అని సంబోధించగలరు. జంధ్యాల గారు,సావిత్రిగారు,శ్రీదేవి గారిలాంటివారు అసలెందుకు మందుకు బానిస అయ్యారో,రోజుకి ఎన్నిసార్లు తాగేవారో కూడ కళ్ళారా చూసినట్టు చెప్పగలరు. అసలు శ్రీదేవిగారు చనిపోయేముందు ఏమేమి ఎలా జరిగిందో అప్పుడు ఆ ప్రదేశంలో ఆయన అక్కడ వున్నట్టే వివరించగలరు.

తమిళ ఎం.జి.ఆర్ గారు స్విస్ బ్యాంక్ లో దాచిన 3000 వేల కోట్ల సొమ్ము వివరాల చీటీని ఆయన తన తలపైన టోపీలో దాచుకుంటే జయలలితగారుదాన్ని తీసి శోభన్‌బాబుగారికిస్తే ఆయన భూములుకొని ఎలా లాభపడ్డారో ప్రత్యక్షసాక్షిలా చెప్పగలరు. అద్భుతమైన నటనను కూడా ప్రదర్శించే వీరి దృష్టిలో జస్ట్ వందల సినిమాలలో మాత్రమే నటించి నంది అవార్డులుకూడా పొందిన సీనియర్ నటులు మురళీమోహన్ గారు అసలు ఆర్టిస్టే కాదని బల్లలు బద్దలు కొట్టగలరు.

మరణించిన మిక్కిలినేని గారివంటి నటులను అపహాస్యం చేయటమే కాక వీరికి అవకాశాలిచ్చి ఉపాధి కల్పించిన కోదండరామిరెడ్డి గారిలాంటి వారి ప్రతిభకూ వ్యంగ్యంగా మరకలద్దగలరు. పాపం అస్సలు మందు వాసనంటే తెలియని వీరు ఇప్పుడు ఇండస్ట్రీలో మందుని దాటి అందరూ డ్రగ్స్ విరివిగా వాడుతున్నారనీ,అవికూడా డాక్టర్లే ఇస్తారనీ చూసినట్లే చెప్పి అన్నం పెడుతున్న ఇండస్ట్రీనే ఎంతవరకైనా దిగజార్చగలరు. వారికి అవకాశాలిచ్చి ప్రోత్సహించిన మా గురువుగారు ఈ లోకంలో లేని”కోడిరామకృష్ణ” గారి మీద అబధ్ధాల అవాకులు చెవాకులు పేలగలరు.

కానీ వారికి తెలియనిదొక్కటే. మా గురువుగారు లేకపోయినా ఆయన శిష్యులం మేమింకా ఇక్కడే వున్నాం. తోటపల్లి మధు గారిలో పశ్చాత్తాపం రాకుంటే వారికున్నంత కుసంస్కార ప్రతిభ మాకు లేకున్నా వారి అసహ్యకర జుగుప్సాకర లీలలు విన్యాసాలు అప్పటివి ఇప్పటివి మాకు పరిపూర్ణంగా తెలుసు కనుక వాటిని విశదపరచి మేమూ మన్ననలందుకోక తప్పేట్టులేదు.

(వారి అబధ్ధపు ఘోష మధ్యలో పట్టరాని నవ్వులతో అలరించిన యాంకర్ స్వప్న గారి సంస్కారం కూడా తక్కువేమీ కాదు.)

                                                                 _____ దేవీ ప్రసాద్.