
హిందూ దేవుళ్లపై సోషల్ మీడియాలో అవమానకర పోస్టులు చేస్తున్న వారితో పాటు నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ నేతల బృందం ఆంధ్రప్రదేశ్ సైబర్ క్రైమ్ డీజీపీ రవిశంకర్ అయ్యన్నర్కు ఫిర్యాదు చేసింది. మొత్తం 57 మంది వివరాలతో కూడిన ఫిర్యాదును టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి, వల్లూరు జయప్రకాష్, షేక్ బాజీ, శ్రీనివాసరెడ్డి సమర్పించారు.
ఈ సందర్భంగా భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, హిందువులు శ్రీరాముడు, సీతమ్మ తల్లి, సరస్వతి దేవి, లక్ష్మీదేవి వంటి దేవతలను అత్యంత భక్తితో ఆరాధిస్తారని అన్నారు. అలాంటి దేవతలపై కొందరు సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేయడం హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
నటుడు ప్రకాష్ రాజ్ కూడా శ్రీరాముడిపై చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. వ్యక్తిగత ప్రచారం కోసం హిందూ దేవుళ్లను లక్ష్యంగా చేసుకుని మాట్లాడడం సరికాదని అన్నారు. అన్ని మతాల విషయంలో ఒకే విధమైన వైఖరి పాటించాలని సూచించారు.
హిందూ దేవుళ్లను అవమానించేలా మాట్లాడిన వారిపై, సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ అధికారులను కోరినట్లు తెలిపారు. తమ ఫిర్యాదుపై అధికారులు సానుకూలంగా స్పందించారని, నిబంధనల ప్రకారం విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు బీజేపీ నేతలు వెల్లడించారు.
