
ప్రముఖ సినీ నటుడు నవీన్ చంద్ర మంగళవారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు నవీన్ చంద్రకు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి, పట్టువస్త్రంతో సత్కరించారు.
అనంతరం ఆలయం వెలుపల నవీన్ చంద్ర మీడియాతో మాట్లాడుతూ… “తలపెట్టిన పనులు విఘ్నాలు లేకుండా నెరవేరాలని శ్రీవారిని ప్రార్థించాను. తిరుమల నుంచే నా కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తున్నాం. డైరెక్టర్ శ్రీకాంత్‌తో కలిసి మంత్ ఆఫ్ మధు సినిమా తరువాత మళ్లీ కాంబినేషన్‌లో చేస్తున్న ఈ రెండో చిత్రం ప్రేక్షకులకు ఒక పెద్ద సర్‌ప్రైజ్‌గా ఉండబోతోంది” అని పేర్కొన్నారు. అలాగే రాబోయే రోజుల్లో తనవి తమిళంలో మూడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. ఆయనతో పాటు దర్శకుడు శ్రీకాంత్ నాగోతి, డిస్ట్రటర్ & నిర్మాత హరీష్ కుమార్ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
ఇదే సందర్భంగా ఇటీవల SVBC చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీధర్ వర్మను కలసి అభినందించారు. తమ కుటుంబానికి గత 15 ఏళ్లుగా శ్రీధర్ వర్మతో మంచి పరిచయం ఉందని, ఒక కళాకారుడిగా SVBCలో ఎటువంటి ప్రోగ్రామ్ చేయడానికైనా లేదా శ్రీవారి సేవలో భాగం కావడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా నవీన్ చంద్ర తెలిపారు.
