సద్గురు 100-రోజుల గ్లోబల్ ‘సేవ్ సాయిల్’ ఉద్యమంపై పుస్తకం హైదరాబాద్‌లో ఆవిష్కరణ

1001219312

ఏప్రిల్ 14, హైదరాబాద్: ప్రపంచవ్యాప్త సేవ్ సాయిల్ ఉద్యమంలోని తెలియని కథలు, అనుభవాలను ఆవిష్కరించే కొత్త పుస్తకం ఈ రోజు హైదరాబాద్‌లో విడుదలైంది. “Save Soil: 100 Days That Moved The World” అనే శీర్షికతో వచ్చిన ఈ పుస్తకాన్ని భరతనాట్యం డాన్సర్ మరియు సద్గురువు కుమార్తె అయిన రాధే జగ్గి సంకలనం చేశారు. సద్గురు ప్రారంభించిన గ్లోబల్ సేవ్ సాయిల్ ఉద్యమాన్ని ఈ పుస్తకం ప్రతిబింబిస్తుంది.

ఈ పుస్తకం 2022లో మట్టి అంతరించిపోవడంపై అవగాహన పెంచేందుకు సద్గురు చేపట్టిన 100 రోజుల, 30,000 కిలోమీటర్ల మోటార్‌సైకిల్ ప్రయాణాన్ని—27 దేశాల మీదుగా జరిగిన ఈ యాత్రను—వివరిస్తుంది. ఈ ప్రయాణంలోని అంతర్గత అనుభవాలు, వాలంటీర్ల కథలు, ఫోటోలు— అన్నింటితో ఈ ఉద్యమం వెనుక ఉన్న విస్తృతి, ఉత్సాహం, సవాళ్లను దగ్గరగా చూపిస్తాయి.

రాధే జగ్గి సేవ్ సాయిల్ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. సద్గురు స్థాపించిన భారతీయ సాంప్రదాయ కళల పరిరక్షణ, ప్రచారం కోసం ఉన్న ‘ప్రాజెక్ట్ సంస్కృతి’తో కలిసి ఈ యాత్రలో అనేక వేదికలపై ప్రదర్శనలు ఇచ్చారు. మట్టిపై ఆధారిత కథాంశంతో చేసిన వారి బృందం ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకుని, ఉద్యమ సందేశాన్ని విస్తృతంగా వ్యాప్తి చేశాయి.

పుస్తకావిష్కరణ కార్యక్రమంలో గాయకుడు, సంగీత దర్శకుడు రామ్ మిరియాల మరియు వెల్‌నెస్ వ్యాపారవేత్త శిల్పా రెడ్డి పాల్గొని, పర్యావరణ బాధ్యతలో సంస్కృతి మరియు వ్యక్తిగత పాత్రపై చర్చించారు.

ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ రాధే అన్నారు:
“రైతులు తమ జీవనోపాధి కోసం పోరాడుతుంటారు. అలాంటి సమయంలో పర్యావరణ బాధ్యతను వాళ్లపై మాత్రమే వేయడం సరైంది కాదు. మనం సహజంగా మట్టిలో సేంద్రీయ పదార్థాలను పెంచాలి. రైతులకు మద్దతు ఇవ్వాలి. అదే సమయంలో ప్రభుత్వాలు కూడా దీనిని విధానంగా అమలు చేస్తేనే, మట్టి సంరక్షణ నిజంగా సాధ్యమవుతుంది.” అన్నారు.

రామ్ మిరియాల తను స్వయంగా రాసి స్వరపరిచిన పాటను పాడారు, ఈ పాట జీవం పుట్టేది, గిట్టేది మట్టిలోనే అంటూ మనిషికి మట్టికి ఉన్న బంధాన్ని, మనం మట్టిని కాపాడుకోవలసిన అవసరాన్ని స్పష్టం చేస్తుంది. మట్టి ప్రాణమున్న బంగారంగా వర్ణిస్తూ పాడిన ఈ పాట మట్టిపై ప్రేమను మరింత పెంచేలా ఉంది.

శిల్పా రెడ్డి మాట్లాడుతూ, “నేను సముద్రంలోని ఒక చుక్క మాత్రమే. ఈ ఉద్యమం యొక్క విశాలత, తీవ్రత నన్ను ఎంతో ప్రేరేపించాయి. అందుకే ఒక పాట పాడి, ఈ లక్ష్యానికి నా వంతు సమర్పణ చేయాలనిపించింది,” అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రత్యక్ష సంగీతం, ఇంటరాక్టివ్ సెగ్మెంట్లు మరియు సరదా ఆటలు కూడా చోటుచేసుకున్నాయి. కొండాపూర్‌లోని అవాన్ ఎక్సెస్‌లో జరిగిన ఈ పుస్తకావిష్కరణలో హైదరాబాద్ నగరంలోని వివిధ వర్గాల ప్రజలు పాల్గొన్నారు. భూమి భవిష్యత్తుపై ఉన్న ఆందోళనతో, పరిష్కారంలో భాగస్వాములవ్వాలనే సంకల్పంతో అందరూ ఒక్కటయ్యారు.

సేవ్ సాయిల్ ఉద్యమం గురించి:

సేవ్ సాయిల్ ఉద్యమాన్ని 2022లో సద్గురు ప్రారంభించారు. వ్యవసాయ భూముల్లో సేంద్రీయ పదార్థాల పరిమాణాన్ని కనీసం 3–6 శాతానికి పెంచే విధానాలను ప్రోత్సహించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా మట్టినాశన సంక్షోభాన్ని ఎదుర్కోవడం దీని లక్ష్యం.

ఈ ఉద్యమం ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు, రైతులు, అంతర్జాతీయ సంస్థలు మరియు పౌరులను ఒక వేదికపైకి తీసుకువచ్చి, ఆహార భద్రత, నీటి భద్రత, జీవ వైవిధ్యం మరియు వాతావరణ స్థిరత్వానికి మట్టి ఎంత కీలకమో చాటుతోంది. గత నాలుగేళ్లలో ఈ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా 410 కోట్ల మందికి పైగా ప్రజలను చేరుకుంది, మట్టి ఆరోగ్య పునరుద్ధరణ ప్రాముఖ్యతపై ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.

ఈ ప్రచారం ప్రస్తుతం పాలసీ మేకర్స్, సంస్థలు, నిపుణులతో కలిసి పనిచేస్తూ, ముఖ్యంగా వ్యవసాయ భూముల్లో సేంద్రీయ పదార్థాల పెంపు, స్థిరమైన భూమి నిర్వహణ పద్ధతుల ప్రోత్సాహంపై దృష్టి సారిస్తోంది. అలాగే రైతుల కోసం ప్రత్యేక కార్యక్రమాలకు మద్దతు ఇస్తూ, మట్టికి అనుకూలమైన వ్యవసాయ విధానాలను ప్రోత్సహించడం ద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం, రసాయన ఎరువులపై ఆధారాన్ని తగ్గించడం, దీర్ఘకాలిక వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడం లక్ష్యంగా పనిచేస్తోంది.