
భారత యువజన చైతన్య పార్టీ అధ్యక్షులు బోడె రామచంద్రయాదవ్ బీసీల హక్కులు, రాజ్యాధికారమే లక్ష్యంగా చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండవ రోజుకు చేరుకుంది. ప్రభుత్వాలు దిగివచ్చి బీసీల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే వరకు తన ప్రాణాలను అర్పించడానికైనా సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు.
ప్రధానంగా ఆయన చేస్తున్న 5 డిమాండ్లు ఇవే :
- బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలి.
- రాజధాని అమరావతిలో బీసీలకు వెయ్యి ఎకరాలు కేటాయించాలి.
- సమగ్ర కులగణనను వెంటనే చేపట్టాలి.
- బీసీలకు విద్య, ఉద్యోగాల్లో, స్థానిక సంస్థలు, చట్టసభల్లో 44 శాతం రిజర్వేషన్లు కల్పించాలి.
- బీసీ కార్పొరేషన్లకు తగిన నిధులు కేటాయించాలి.
వెల్లువెత్తుతున్న మద్దతు :
ఈ దీక్షకు జాతీయ స్థాయిలో విశేష స్పందన లభిస్తోంది. బీసీ మండల్ మనుమడు సూరజ్ మండల్, మహాత్మా జ్యోతిరావు పూలే ముని మనుమరాలు నీతతాయి రమాకాంత్ పూలే స్వయంగా హాజరై మద్దతు తెలిపారు. అలాగే సమాజ్ వాదీ పార్టీ, ఆర్జేడీ నేతలతో పాటు పలు బీసీ కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు సంఘీభావం ప్రకటించాయి. సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ (ట్విట్టర్)లో సైతం ఈ దీక్ష ట్రెండింగ్ లోకి రావడం గమనార్హం.
ఈ సందర్భంగా రామచంద్రయాదవ్ మాట్లాడుతూ.. ఇది తన వ్యక్తిగత పోరాటం కాదని, బీసీల కోసం చేస్తున్న ధర్మయుద్ధమని పేర్కొన్నారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలనే గుర్తుచేస్తున్నామని, కుట్రలతో దీక్షను భగ్నం చేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గత వైసీపీ ప్రభుత్వం కూడా ఐదేళ్లలో బీసీలకు చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు.
https://x.com/i/status/2043212140027498720
