‘ఉద్వేగం’ విడుదల తేదీ మార్పు – నవంబర్ 29న భారీ విడుదల

WhatsApp Image 2024 11 21 at 12.25.10 4e276c9a

కళా సృష్టి ఇంటర్నేషనల్, మణిదీప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై జి. శంకర్, ఎల్. మధు నిర్మించిన చిత్రం ఉద్వేగం. ఈ కోర్టు డ్రామాకు మహిపాల్ రెడ్డి దర్శకత్వం వహించారు. త్రిగున్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో దీప్సిక కథానాయికగా నటించగా శ్రీకాంత్ భరత్, సురేష్ నాయుడు, పరుచూరి గోపాలకృష్ణ, శివకృష్ణ, అంజలి తదితరులు కీలకపాత్రలు పోషించారు. అజయ్ సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన
ఈ చిత్రానికి కార్తీక్ కొడగండ్ల సంగీతాన్ని అందించారు. 2021లో వచ్చిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తర్వాత కోర్టు నేపథ్యంలో వస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. అలాగే త్రిగున్ కి ఇది 25వ సినిమా కావడం మరో విశేషం.

ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ‘ఉద్వేగం’పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా కోర్టు డ్రామాలను ఇష్టపడే వారు, ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా ఒక వారం ఆలస్యంగా థియేటర్లలో అడుగు పెట్టనుంది. నవంబర్ 22న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని, సాంకేతిక కారణాల వల్ల నవంబర్ 29న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు తాజాగా ప్రెస్ మీట్ ను నిర్వహించారు.

ఈ సందర్భంగా నిర్మాతలు శంకర్, మధు మాట్లాడుతూ.. “మా ఉద్వేగం సినిమా నవంబర్ 22న రావాల్సి ఉంది. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఒక వారం ఆలస్యంగా విడుదల చేస్తున్నాం. నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో విడుదల చేయబోతున్నాం. అలాగే కర్ణాటకతో పాటు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ లోనూ భారీగా విడుదల చేయనున్నాం. ఈ వారం రోజులు ప్రమోషన్స్ లోనూ దూకుడు ప్రదర్శించబోతున్నాం. సినిమాని వీలైనంత ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాము. మా సినిమా కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులను వారం ఆలస్యంగా వస్తూ కాస్త నిరాశ కలిగించినా, కంటెంట్ పరంగా పూర్తి స్థాయిలో మెప్పిస్తాం. నవంబర్ 29న పక్కా సినిమాని విడుదల చేస్తాం. పక్కా హిట్ కొడతాం.” అన్నారు.

దర్శకుడు మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. “మీతో పాటు మేము కూడా నవంబర్ 22 కోసం ఎంతగానో ఎదురుచూశాం. కానీ సాంకేతిక కారణాల వల్ల చివరి నిమిషంలో సినిమాని వాయిదా వేయాల్సి వచ్చింది. నిజానికి సమస్య చాలా చిన్నదే. కానీ కాస్త ఆలస్యంగా వచ్చినా, పర్ఫెక్ట్ అవుట్ పుట్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నాం. వారం ఆలస్యంగా వచ్చినా, సినిమా మీ అందరినీ ఖచ్చితంగా అలరిస్తుంది. నవంబర్ 29న థియేటర్లకు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి.” అన్నారు.

నటీనటులు: త్రిగున్, దీప్సిక, శ్రీకాంత్ భరత్, సురేష్ నాయుడు, పరుచూరి గోపాలకృష్ణ, శివ కృష్ణ, అంజలి తదితరులు

టెక్నీషియన్స్ :
సంగీతం: కార్తిక్ కొడగండ్ల
సినిమాటోగ్రఫీ: అజయ్
ఎడిటర్: జశ్వీన్ ప్రభు
నిర్మాతలు: జి శంకర్, ఎల్ మధు
దర్శకుడు: మహిపాల్ రెడ్డి
పీఆర్ఓ: హరీష్, దినేష్