
తమిళ చిత్రం ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ, హాస్యం, భావోద్వేగాల కలయికతో ప్రేక్షకులను, సినీ ప్రముఖులను ఆకట్టుకుంటోంది. తాజాగా, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఈ సినిమాను ఆకాశమంతా పొగిడారు. ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ, “‘టూరిస్ట్ ఫ్యామిలీ’ నా హృదయాన్ని తాకింది. కడుపుబ్బా నవ్వించే హాస్యంతో పాటు భావోద్వేగాలు చక్కిలిగింతలు పెట్టాయి. దర్శకుడు అభిషాన్ జీవింత్ అద్భుతంగా తెరకెక్కించారు. ఇటీవల కాలంలో నేను చూసిన బెస్ట్ సినిమా ఇది” అని రాజమౌళి పేర్కొన్నారు. ఈ ప్రశంసలతో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ చిత్రం, తమిళ సినిమా ఇండస్ట్రీలో కొత్త ఒరవడిని సృష్టిస్తోంది. ప్రేక్షకులు కూడా ఈ అద్భుతాన్ని మిస్ కావొద్దని రాజమౌళి సూచించారు.
