హైదరాబాద్‌లో సినీ నటి కల్పిక గణేశ్‌తో పబ్‌ సిబ్బంది ఘర్షణ.. వీడియో వైరల్‌

Kalpika

హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో ఉన్న ప్రముఖ ప్రిజం పబ్‌లో శుక్రవారం రాత్రి గలాట సంఘటన చోటుచేసుకుంది. సినీ నటి కల్పిక గణేశ్‌ తన స్నేహితులతో కలిసి బర్త్‌డే వేడుకల కోసం పబ్‌కు వెళ్లగా, అక్కడి సిబ్బందితో వివాదం జరిగింది. కేక్‌కు సంబంధించిన విషయంలో పబ్‌ సిబ్బంది ఆమెతో అమర్యాదగా మాట్లాడారని, దూషణలకు దిగారని కల్పిక ఆరోపించారు. ఈ ఘటనలో సిబ్బంది ఆమెను ‘డ్రగ్‌ ఎడిక్ట్‌’ అని అవమానించారని, వాగ్వాదం తీవ్రమైన నేపథ్యంలో పబ్‌ నిర్వాహకులు కూడా దురుసుగా వ్యవహరించారని ఆమె తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను కల్పిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయడంతో అది వైరల్‌గా మారింది.

ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, అధికారులు స్పందించలేదని కల్పిక ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌ హబీబుల్లా ఖాన్‌ మాత్రం తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్పష్టం చేశారు. పబ్‌ నిర్వాహకుల నుంచి డయల్‌ 100కు కాల్‌ రావడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రెండు వర్గాలను సముదాయించి వెళ్లినట్లు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.