‘విర్జిన్ బాయ్స్’ చిత్ర బృందాన్ని బెదిరిస్తున్న పూల చొక్కా నవీన్

రాజ్ గురు ఎంటర్టైన్మెంట్స్ గ్యానర్ పై రాజా దారపునేని నిర్మాతగా దయానంద్ దర్శకత్వంలో జూలై 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వర్జిన్ బాయ్స్. ఈ చిత్రంలో మిత్ర శర్మ, గీతానంద్, శ్రీహాన్, జర్నీఫర్, రోనిత్, అన్షుల, బబ్లు, కౌశల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. అయితే ఎంతో ప్రేక్షక ఆదరణతో ఈ సినిమా విజయవంతమైన సందర్భంగా చిత్ర బృందం సక్సెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా సమక్షంలో కేక్ కటింగ్ తో చిత్ర బృందం వేడుకలు చేసుకున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత దారపునేని రాజా మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. మా వర్జిన్ బాయ్స్ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. మాకు మొదటి నుండి సపోర్టుగా నిలిచిన మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నిన్న సిటీలోని వేరు వేరు థియేటర్లకు వెళ్లినప్పుడు అక్కడ ప్రజాదరణ చూసి ఎంత సంతోషం వేసింది. అయితే ఇంత గొప్ప ఆదరణ పొందుతున్న సినిమాపై కొంతమంది మీడియా ముసుగులో విషం జల్లుతున్నారు. మేము థియేటర్లలో చూసినప్పుడు ప్రేక్షకులకు ఈ సినిమా ఎంతగా నచ్చిందో స్వయంగా అర్థమైంది. కానీ పూల చొక్కా నవీన్ లాంటివారు మా సినిమా నుండి డబ్బులు డిమాండ్ చేసి అవి ఇవ్వకపోయేప్పటికి మాపై పగ పట్టి మా సినిమాను ప్రేక్షకులలో నెగిటివ్ చేసేందుకుగాను వారి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కావాలని మా సినిమా ఇమేజ్ డామేజ్ చేసే విధంగా రివ్యూలు ఇస్తున్నారు. అలాగే మరికొందరు యూట్యూబ్ ఛానల్స్ సినిమా విడుదలకు ముందే సినిమాలపై నెగిటివ్గా రివ్యూలు ఇచ్చి ప్రేక్షకులను తప్పుదారి పట్టిస్తున్నారు. వారిపై ఇప్పటికే ఫిలిం చాంబర్లో కంప్లైంట్ చేశాము. లీగల్ గా కూడా వారిపై చర్యలు తీసుకుంటూ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. దయచేసి ప్రేక్షకులు అటువంటి వాడి రివ్యూలను నమ్మి మోసపోకండి. మా చిత్ర బృందానికి పనిచేసిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను” అన్నారు.

దర్శకుడు దయానంద్ మాట్లాడుతూ… “మా సినిమాను అన్ని విధాలుగా ఆదరించిన ప్రేక్షకులకు చాలా థాంక్స్. సినిమా టైటిల్ చూసి ఎలా ఉంటుందో అనుకున్నవారంతా థియేటర్లలో సినిమా చూశాక ఎంతగానో ఆదరించడం జరిగింది. ఈ సినిమా కోసం కష్టపడిన అందరికీ నా ధన్యవాదాలు. అలాగే మా సినిమాపై విషం జల్లడానికి ప్రయత్నిస్తున్న వారిపై తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాము. అలాగే నటీనటులపై అతను చేసిన కామెంట్లపై కచ్చితంగా చర్యలు తీసుకుంటున్నాము. మా సినిమాను థియేటర్లో చూసి ప్రతి సీనుకు కనెక్ట్ అయ్యి ఎంజాయ్ చేసిన ప్రేక్షకుల ఆదరణను మేము నమ్ముతాము. సినిమా మరింత విజయం సాధించిపోతుంది” అన్నారు.

నటుడు గీతానంద్ మాట్లాడుతూ… “మా సినిమాను మంచి విజయం సాధిస్తూ ముందుకు వెళ్లడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. దానికి కారణమైన మీడియా వారికి, అలాగే చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మా ధన్యవాదాలు. ఎంతో మంది కలిసి ఎంతో కాలం కష్టపడి ఒక సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము. అటువంటి సినిమాలు సపోర్ట్ చేసి ముందుకు తీసుకుని వెళ్లాలి. అంతేకానీ కొత్తవారు అంటూ సపోర్ట్ చేయకుండా ఉండకపోగా నెగిటివ్గా మాట్లాడటం అనేది తప్పు. నాది ఈ వర్జిన్ బాయ్స్ మూడో సినిమా. దయచేసి సినిమాలపై నెగిటివ్ ప్రచారం చేయకండి” అన్నారు.

నటుడు శ్రీహాన్ మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నమస్కారం. ముందుగా మా సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు నేను మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మొదటిసారి నన్ను నేను వెండితెరపై చూసుకోవడం నాకు చాలా సంతోషకరంగా అనిపించింది. మా సినిమాకు ఏ సర్టిఫికెట్ రావడంతో పిల్లలను ఈ సినిమాకు దూరంగా ఉంచాలని కోరుకుంటున్నాను. అలాగే సినిమాను మరింత సపోర్ట్ చేసి ఇంకా విజయం సాధించేందుకు తోడ్పడాలని కోరుకుంటున్నాను” అంటూ ముగించారు.

ఆర్టిస్టులు : గీతానంద్, మిత్రా శర్మ, శ్రీహన్, రోనీత్, జెన్నీఫర్, అన్షుల, సుజిత్ కుమార్, బబ్లు, అభిలాష్

డైరెక్టర్: దయానంద్
ప్రొడ్యూసర్ : రాజా దరపునేని
బ్యానర్ : రాజ్ గురు ఫిలిమ్స్
మ్యూజిక్ డైరెక్టర్: స్మరణ్ సాయి
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
డీఓపి : వెంకట ప్రసాద్
లిరిక్స్- పూర్ణ చారి
సింగర్ – ఆదిత్య ఆర్ కె
పిఆర్ఓ : మధు విఆర్
డిజిటల్ – డిజిటల్ దుకాణం