
కమల్ హాసన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు, కానీ ఈసారి సినిమాకు సంబంధించిన కారణంతో కాదు, ఆయన చేసిన వ్యాఖ్యల వల్ల. ‘థగ్ లైఫ్’ సినిమా ప్రమోషన్స్ కోసం బెంగళూరు వెళ్లిన కమల్, కన్నడ భాష గురించి చేసిన ఒక వ్యాఖ్య కర్ణాటకలో గట్టి ఆందోళనలకు దారితీసింది. ఆయన ఏమన్నారంటే, “కన్నడ భాష తమిళం నుంచే ఉద్భవించింది.” ఈ ఒక్క మాటతో కన్నడ రక్షణ వేదిక సభ్యులు ఆగ్రహించి, బెంగళూరులోని ఆర్టీ నగర్ పోలీస్ స్టేషన్లో కమల్‌పై ఫిర్యాదు చేశారు. కన్నడ భాషను అవమానించారని, దాని గౌరవాన్ని కించపరిచారని ఆరోపణలు వచ్చాయి.
సోషల్ మీడియాలో ఈ ఇష్యూ వైరల్ అవుతూ, కమల్‌కు వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయి. కొందరు ‘థగ్ లైఫ్’ సినిమాను కర్ణాటకలో నిషేధించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే, కమల్ హాసన్ మాత్రం స్పష్టంగా సమాధానమిచ్చారు: “నేను ఎలాంటి తప్పూ చేయలేదు, క్షమాపణ చెప్పను.” ఈ వివాదం కర్ణాటకలో ఇప్పటికే ఉన్న భాషా సమస్యలను మరింత రెచ్చగొట్టింది. స్థానికులు కన్నడ భాషను గౌరవించాలని, ఇతర భాషలను తక్కువ చేసే వ్యాఖ్యలు చేయొద్దని గట్టిగా కోరుతున్నారు.
ఈ వివాదం ‘థగ్ లైఫ్’ సినిమా రిలీజ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. కర్ణాటకలో సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కమల్ ఈ సమస్యను ఎలా సమర్థవంతంగా హ్యాండిల్ చేస్తారనేది ఆసక్తికరంగా ఉంది.
