
సీనియర్ నటుడు కమల్‌హాసన్ చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో వివాదాన్ని రేకెత్తించాయి. “కన్నడ భాష తమిళం నుంచే పుట్టింది” అన్న ఆయన వ్యాఖ్యలు కన్నడ భాషాభిమానులను ఆగ్రహానికి గురిచేశాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక హైకోర్టు కమల్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది. “మీరేమైనా చరిత్రకారులా లేదా భాషా నిపుణులా? కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందని ఏ ఆధారాలతో చెప్పారు?” అని కోర్టు ప్రశ్నించింది. ఈ వ్యాఖ్యలు ప్రజల భావోద్వేగాలను గాయపరిచాయని, దీనివల్ల కర్ణాటకలో అశాంతి నెలకొందని కోర్టు తీవ్రంగా ఆక్షేపించింది.
కమల్‌హాసన్ ఇప్పటికే వివరణ ఇచ్చినప్పటికీ, కన్నడిగులు క్షమాపణ చెప్పాలని పట్టుబడుతున్నారు. కోర్టు సైతం, క్షమాపణతోనే ఈ వివాదం సద్దుమణుగుతుందని సూచించింది. “భాషలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ దేశం ఒక్కటే” అని కోర్టు స్పష్టం చేసింది. ఈ వివాదం కారణంగా కమల్ నటిస్తున్న ‘థగ్ లైఫ్’ సినిమా కర్ణాటకలో విడుదలపై అనిశ్చితి నెలకొంది.
కమల్ వ్యాఖ్యలు దక్షిణ భారత సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కన్నడ భాషాభిమానులు నిరసనలు చేస్తుండగా, రాజకీయ పార్టీలు కూడా ఈ అంశంపై స్పందిస్తున్నాయి. కోర్టు సూచన మేరకు కమల్ క్షమాపణ చెబుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది
