
భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ బీసీ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో శనివారం ‘ధర్మ దీక్ష’ పేరుతో ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు.
గతంలో నిర్వహించిన “బీసీ సింహగర్జన” సభలో ప్రభుత్వం ముందు ఉంచిన ఐదు ప్రధాన డిమాండ్లపై ఎలాంటి స్పందన రాకపోవడంతోనే తాను ఈ దీక్షను చేపట్టినట్లు ఆయన స్పష్టం చేశారు. బీసీలంతా ఐక్యంగా పోరాడితేనే హక్కుల సాధన సాకారమవుతుందని ఉద్ఘాటించారు.
ఈ దీక్షకు బీపీ మండల్ మనుమడు డాక్టర్ సూరజ్ మండల్, మహాత్మా జ్యోతిబా పూలే ముని మనుమరాలు డాక్టర్ ఎస్. పూలే ప్రత్యేక అతిథులుగా హాజరై రామచంద్ర యాదవ్‌కు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు సమాన హక్కులు, రాజ్యాధికారం దక్కినప్పుడే పూలే ఆశయాలకు అనుగుణంగా సమసమాజ స్థాపన సాధ్యమవుతుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ప్రభుత్వం వెంటనే ఆయన డిమాండ్లను అంగీకరించాలని కోరారు. ఈ దీక్షకు పలు సంఘాల నాయకులు సైతం సంఘీభావం తెలిపారు.
ప్రభుత్వం ముందు ఉంచిన ఐదు ప్రధాన డిమాండ్లు ఇవే:
- బీసీ రక్షణ చట్టం తీసుకురావాలి.
- రాజధానిలో బీసీల కోసం 1,000 ఎకరాలు కేటాయించాలి.
- రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టాలి.
- బీసీ కార్పొరేషన్లకు తగిన నిధులు మంజూరు చేయాలి.
- విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలు మరియు చట్టసభల్లో బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించాలి.
