జూబ్లీహిల్స్ స్థల వివాదం.. ఇద్దరు సినీ నిర్మాతలపై కేసు నమోదు

1001487416

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో స్థల కబ్జా యత్నం ఆరోపణలతో ఇద్దరు సినీ నిర్మాతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్మాతలు సి. కళ్యాణ్, బురుగుపల్లి శివరామకృష్ణతో పాటు మరికొందరిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

వ్యాపారవేత్త కాంతమనేని రవిశంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. వివాదాస్పద స్థలం జూబ్లీహిల్స్‌లోని ఉమెన్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి చెందిన ప్లాట్ నంబర్ 89గా పోలీసులు తెలిపారు.

ఈ స్థలానికి సంబంధించిన కేసు ప్రస్తుతం కోర్టులో పెండింగ్‌లో ఉంది. జూన్ 10న కోర్టు, రవిశంకర్ స్వాధీనంలో ఉన్న భూమిలో ఎలాంటి జోక్యం చేసుకోవద్దని తాత్కాలిక నిషేధాజ్ఞలు జారీ చేసింది.

అయితే, కోర్టు ఆదేశాలు అమల్లో ఉన్నప్పటికీ నిందితులు అక్రమంగా స్థలంలోకి ప్రవేశించారని రవిశంకర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. స్థలంలోని తాళాలు పగులగొట్టి, గేటును ధ్వంసం చేసి, అక్కడ ఉన్న సామగ్రిని చెల్లాచెదురు చేశారని ఆరోపించారు.

అంతేకాకుండా అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని బెదిరించి, నిర్మించిన గదిని కూడా ధ్వంసం చేశారని ఫిర్యాదులో వెల్లడించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.